Sunday, November 17, 2024

మిథాలీ నయా రికార్డ్‌, 6 వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి క్రికెటర్‌

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్‌ క్రికెట్‌లో అత్యధిక వన్డే ప్రపంచ కప్‌లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లోనూ ఆడటం ద్వారా.. 39 ఏళ్ల మిథాలీ రాజ్‌.. ఈ రికార్డును అందుకుంది. అత్యంత అనుభవం ఉన్న మిథాలీ రాజ్‌కు ఇది ఆరో వన్డే ప్రపంచకప్‌. దీంతో ఆరు వన్డే ప్రపంచ కప్‌లు ఆడిన తొలి ఉమెన్‌ క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ నిలిచింది. 2000వ సంవత్సరంలో అంతర్జాతీక క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలీ రాజ్‌.. 2000, 2005, 2009, 2013, 2017తో పాటు తాజాగా జరుగుతున్న 2022 వన్డే ప్రపంచ కప్‌లోనూ ఆడుతున్నది. ఈ ప్రపంచ కప్‌ తరువాత.. తాను క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు మిథాలీ రాజ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే..

పరుగుల్లోనూ రారాణి..

ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ రాజ్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఆరు ప్రపంచ కప్‌లలో 32 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్‌.. 52 సగటుతో.. 1,148 పరుగులు చేసింది. ఇందులో రెండు రెండు సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉమెన్స్‌ క్రికెట్‌లో వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ క్రీడాకారిణిగా కూడా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మిథాలీ రాజ్‌ నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement