వచ్చే సంవత్సరం న్యూజిలాండ్ లో జరిగే ప్రపంచ కప్ టోర్ని తర్వాత రిటైర్ మెంట్ ఇస్తానని తెలిపారు క్రికేటర్ మిథాలి రాజ్. ఎన్నో ఏళ్లుగా భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడుతూ, కెప్టెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నా, కలగా మిగిలిన వరల్డ్ కప్ టైటిల్ కోసం మరొక్కసారి ప్రయత్నించి, ఆపై ఆటకు రిటైర్ మెంట్ చెబుతానని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. గత కొన్ని నెలలుగా కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయిన మిథాలీ ఈ ఏడాదితో 21 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్నది. ఆమె రిటైర్మెంట్‌పై గతంలో చాలా సార్లు వార్తలు వచ్చినా ఏనాడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు మిథాలీనే స్వయంగా తన వీడ్కోలుపై స్పష్టత ఇచ్చింది. 2022లో న్యూజీలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ తనకు చివరిదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి తన ఫిట్ నెస్ పైనే దృష్టిని సారించానని చెప్పింది.
ప్రపంచ మహిళా క్రికెట్‌లో లేడీ సచిన్ అని పిలువబడే మిథాలీ రాజ్ తన కెరీర్‌లో 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 7 వేల పరుగుల మైలు రాయి దాటిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కారు. 10 టెస్టుల్లో 663 పరుగులు, 89 టీ20 మ్యాచ్‌లలో 2364 పరుగులు చేసింది. తన కెరీర్‌లో మొత్తం 8 సెంచరీలు, 76 అర్దసెంచరీలు నమోదు చేసింది.