Saturday, November 23, 2024

ఖగోళ భౌతిక శాస్త్రంలో నెగ్గిన హాకింగ్ సిద్ధాంతం

వాషింగ్టన్‌: ఖగోళభౌతిక శాస్త్రంలో చర్చనీయాంశమైన స్టీఫెన్‌ హాకింగ్‌ సిద్ధాంతం ఎట్టకేలకు ప్రయోగపూర్వకంగా రుజువైంది. రెండు కృష్ణబిలాల విలీనం ఫలితంగా ఉత్పన్నమైన గురుత్వాకర్షణ తరంగాల ఆధారంగా శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. విశ్వంలో నిగూఢ వస్తువుల్లో కృష్ణబిలాలు ఒకటి. దివంగత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ వీటిపై అధ్యయనం చేశారు. కాలానుగుణంగా ఈ కృష్ణబిలం పరిమాణం తగ్గదని 1971లో ఆయన ఓ సూత్రీకరణ చేశారు. తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన మ్యాక్సిమిలానో ఇసి నేతృత్వంలోని శాస్త్రవేత్తలు దీనిపై దృష్టిసారించారు. విశ్వంలో రెండు కృష్ణబిలాల విలీనం వల్ల ఉత్పన్నమైన గురుత్వాకర్షణ తరంగాలను 2017 ‘లిగో’ అనే భారీ అబ్జర్వేటరీ పసిగట్టింది. ఈ తరంగాల డేటాను మ్యాక్సిమిలానో బృందం.. విలీనానికి ముందు, తర్వాత అనే రెండు విభాగాలుగా వర్గీకరించింది. తద్వారా ఒక్కో విభాగంలో కృష్ణబిల ఉపరితల ప్రాంతాన్ని లెక్కించింది. విలీనం అనంతరం ఏర్పడ్డ భారీ కృష్ణబిల ఉపరితల ప్రాంతం.. రెండు చిన్న కృష్ణబిలాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement