న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ఆ వ్యవస్థ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నాయకత్వం ప్రకటించింది. ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి కూనంనేటి సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్‌భవన్ కాస్తా బీజేపీ కార్యాలయంగా మారిందని, గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే కాదని, బీజేపీ అధికారంలో లేని అన్ని రాష్ట్రాల్లోనూ గవర్నర్లు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగపరుస్తూ దాడులకు పాల్పడుతోందని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణలో ప్రత్యేకించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు కోట్ల రూపాయలు ఎరజూపడం లేదంటే దర్యాప్తు సంస్థలను ప్రయోగించి బెదిరించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. ఢిల్లీలో, తెలంగాణలో ఇలానే ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి బీజేపీ నేతలు విఫలమయ్యారు.
దేశంలో ఎక్కడైనా బీజేపీ నేతలపై లేదా ఆ పార్టీ సానుభూతిపరులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరిగాయా అంటూ సాంబశివరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరాటం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 7న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్‌భవన్ల ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాజ్‌భవన్ ముట్టడికి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారని చెప్పారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
2024 నాటికి పార్టీకి వందేళ్లు
2024 నాటికి దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా పార్టీ పటిష్టం చేసేందుకు నడుం బిగించామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యానికి ఎదరవుతున్న ముప్పు, రాజ్యాంగ పరిరక్షణ సహా అనేకాంశాలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామని ఆయన తెలిపారు. మోదీ అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. డిసెంబర్ చివరిన దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని పిలుపునిచ్చినట్టు తెలిపారు.