Monday, November 25, 2024

Delhi | ఓటర్ల జాబితాలో ఎక్కడికక్కడ తప్పులతడకలు : ఏపీ బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అనేక రకాలుగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ఆరోపించారు. గురువారం సాయంత్రం గం. 4.00 సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.  పురందేశ్వరి నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, మాజీ మంత్రి వైఎస్ చౌదరి, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కూడిన బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తిరుపతి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల వివరాలను ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్టు నేతలు తెలిపారు.

అనంతరం ఎంపీ సీఎం రమేశ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఉన్నవారి పేర్లను తొలగించడం, లేని పేర్లను చేర్చడం, ఒకే ఇంటి చిరునామాతో పదుల కొద్ది ఓటర్ల పేర్లు నమోదు కావడం, నకిలీ కార్డుల ఓటర్ కార్డుల తయారీ సహా అన్ని అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క తిరుపతిలోనే ఏకంగా 35 వేల నకిలీ గుర్తింపు కార్డులతో ఓట్లు వేసిన ఘటనలు ఉన్నాయని ఆమె ఉదహరించారు. దొంగ ఓట్లతో గెలుపొందాలన్న ప్రయత్నం అధికార పార్టీ చేస్తోందని ఆరోపించారు.

- Advertisement -

ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అక్రమంగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన సమగ్ర ఆధారాలు తాము సేకరించి ఈసీకి అందజేశామని అన్నారు. ఎన్నికల సంఘంలోని కంప్యూటర్ నిపుణులు దృష్టి సారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, తాము పెన్ డ్రైవ్‌లో చాలా సమాచారం సేకరించి అందజేశామని తెలిపారు. నిన్నమొన్నటి వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారని, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో తాము పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు.

వైఎస్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్ల సమగ్ర సమాచారాన్ని చాలా లోతుగా సేకరించి వేర్వేరు వర్గాలుగా వర్గీకరించి పెట్టుకున్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగం చేయడం చట్టవిరుద్ధమని, దీనిపై దృష్టి సారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. నకిలీ ఓటర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయమని సూచించారా అంటే.. ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పురందేశ్వరి అన్నారు. ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు ఈసీకి తగిన ఆధారాలు అందజేశామని తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement