న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సేవతో ప్రజలకు దగ్గరవ్వవచ్చని, కష్టపడితే తెలంగాణలో అధికారం మనదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్పొరేట్లకు మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సంకేతాలిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్నప్రధాని నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన 46 మంది కార్పొరేటర్లు, రాష్ట్ర నేతలతో నరేంద్రమోదీ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ నేతలు రామచంద్రరావు, రామచంద్రారెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఒకొక్కరిని పరిచయం చేసుకున్న ప్రధాని వారి కుటుంబం, పిల్లలు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, మిగతా సమయమంతా ప్రజా సేవలోనే మమేకమవ్వాలని కార్పొరేటర్లకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని భావిస్తున్న కమలనాథులు తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలోనే వరుసగా అగ్రనాయకత్వం హైదరాబాద్ సహా తెలంగాణలో కార్యక్రమాలను రూపొందించుకుని పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 2న తొలిసారి ఢిల్లీ గడ్డపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించి, తమ తదుపరి లక్ష్యం తెలంగాణాయేనని సంకేతాలిచ్చారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ నగరాన్నే ఎంపిక చేయడం ‘మిషన్ తెలంగాణ’లో భాగమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారం చేపట్టేలా క్షేత్రస్థాయి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ప్రధాని గంటన్నరకు పైగా సమయం కేటాయించి నూతనోత్తేజాన్ని కలిగించారు. ప్రధానితో సాయంత్రం గం. 4.00కు జరగాల్సిన ఈ సమావేశం సాయంత్రం గం. 6.00కు మొదలైంది. ఇందుకోసం గంట ముందుగానే కార్పొరేటర్లు, బీజేపీ నేతలు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. గంటన్నర పాటు జరిగిన సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేరుగా హైదరాబాద్ తిరుగుప్రయాణమవగా.. కిషన్ రెడ్డి కార్పొరేటర్లను తన వెంట తీసుకెళ్లారు. బుధవారం కార్పొరేటర్లు ఢిల్లీలోని పార్లమెంట్, ప్రధాని సంగ్రహాలయం సహా మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూసేందుకు ఏర్పాట్లు చేశారు.
కిషన్ రెడ్డి ఆతిథ్యం..
ప్రధానితో భేటీ కోసం ఢిల్లీ చేరుకున్న జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నేతలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆతిథ్యమిచ్చారు. మధ్యాహ్నం ఆయన నివాసంలోనే ప్రత్యేక వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు కార్పొరేటర్లు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌ను కలిశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం ఆయన కార్పొరేటర్లకు సూచనలు చేశారు. ఈ భేటీ అనంతరం మళ్లీ కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కార్పొరేటర్లతో సమావేశమయ్యేందుకు కిషన్ రెడ్డి నివాసానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వచ్చారు. ఆయనతో భేటీ ముగిసిన తర్వాత కార్పొరేటర్లు భోజనాలు ముగించుకుని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మాట్లాడుతూ గడిపారు. సాయంత్రం గం. 5.00 సమయంలో కిషన్ రెడ్డి నివాసం నుంచి 2 బస్సుల్లో కార్పొరేటర్లు, పార్టీ రాష్ట్ర విభాగం నేతలు ప్రధాని నివాసానికి బయల్దేరి వెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కార్పొరేటర్లకు బీఎస్ఎఫ్ అశ్విని మెస్‌లో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. అంతకుముందు కిషన్ రెడ్డి వారితో కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా కొందరు కార్పొరేటర్లు దేశభక్తి గీతాలు ఆలపించారు.
సామాన్యుడితో ప్రపంచ నేత: కార్పొరేటర్లు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవడంపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న తమకు ఎంతో విలువైన సమయం కేటాయించిన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. మోదీ కేవలం భారత ప్రధాని మాత్రమే కాదని, ప్రపంచనేతగా ఉన్న ఆయనను కలవడం తమ అదృష్టమని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఓ సామాన్య కార్యకర్త ఇంత పెద్దస్థాయిలో ఉన్న నేతతో సమావేశం కావడం ఏ పార్టీలోనూ జరగదని, అది బీజేపీలో మాత్రమే సాధ్యమని అన్నారు. అలాగే కష్టపడితే సామాన్య కార్యకర్త సైతం ఉన్నత పదవులను అందుకోవచ్చని చెప్పడానికి ప్రధాని మోదీ జీవితమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మరికొందరు కార్పొరేటర్లు మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకే సమయం దొరకని పరిస్థితి ఉందని, అలాంటిది బీజేపీలో ఏకంగా దేశ ప్రధానే తమకు సమయమిచ్చి సుదీర్ఘంగా మాట్లాడారని అన్నారు. నిత్యం ప్రజలతోనే ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ప్రధాని తమకు సూచించారని వారు చెప్పారు. వచ్చే నెల హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని నిర్దేశం చేశారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.