– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం.. పాటు హిమాచల్ ప్రదేశ్ ఓటమి వంటి డిఫరెంట్ రిజల్ట్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు కర్నాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. కర్నాటకలో టాస్క్‌ని మరింత ఈజీ చేసుకునేందుకు ఇప్పటినుంచే కార్యాచరణకు దిగుతోంది. అక్కడ విజయం సాధించడానికి కాషాయ పార్టీ జనవరి, ఫిబ్రవరిలో 3 నుండి 4 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్రానికి తీసుకురావాలని యోచిస్తోంది. జనవరి మొదటి వారంలో ప్రతిష్టాత్మక ఐఐటీ-ధార్వాడ్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. IIT -ధార్వాడ్ ఉత్తర కర్నాటక ప్రాంతం యొక్క కలల ప్రాజెక్ట్ గా చెప్పుకుంటారు.
ఇక.. ఉత్తరాది, కళ్యాణ కర్నాటక ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకునేందుకు బెలగావిలో నిర్వహించనున్న భారీ రైతు సదస్సుకు కూడా బీజేపీ నేతలు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో బెంగళూరులో జరగనున్న ఎయిర్‌షోను కూడా ప్రధాని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ తరహా రోడ్ షోలు ప్లాన్ చేయనప్పటికీ, ప్రధాని మోదీ కర్నాటకలో అనేక పర్యటనలు చేసేలా చూస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని హిందూ కార్యకర్తలు అధికార బీజేపీకి సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ప్రకటించారు. మరోవైపు, హిందూ మహాసభ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పింది.
అయితే.. అధికారాన్ని చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ హిందుత్వాను వాడుకుంటోందని శ్రీరామసు అంటోంది. కోస్తా, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో శ్రీరామ సేన.. హిందూ మహాసభ ఇంతకుముందు బీజేపీకి విధేయతగా వ్యవహరించేవి. అంతేకాకుండా గట్టి సపోర్ట్‌గా నిలిచేవి. ఇక ఇప్పుడు ఈ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయడంతో కాషాయ పార్టీని ఆందోళన పడేస్తోంది. బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా ప్రాంతంలో పార్టీకి నష్టం కలిగించే సత్తా ఈ పార్టీలకు ఉంది. ఉత్తర కర్నాటక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలపై ప్రమోద్ ముతాలిక్‌కు గణనీయమైన పట్టు ఉంది.
ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ ప్రసంగలు పార్టీకి బలంగా మారుతాయని భావిస్తున్నారు. లేకుంటే తమ భవిష్యత్తు ఆశలు తారుమారు అవుతాయని బీజేపీ నేతలు హైకమాండ్‌కి తెలియజేసినట్టు సమాచారం అందుతోంది. హిందూ కార్యకర్తలు తమను శత్రువులుగా భావిస్తున్నందున, ప్రధాని మోదీ మాటలు మాత్రమే వారిని శాంతింపజేస్తాయని, వారిని తిరిగి బీజేపీకి అనుకూలంగా మార్చుకుతీరుతామని ఆ పార్టీ వర్గాల అంటున్నాయి.