Friday, November 22, 2024

Follow up: లక్నోలో మిస్సింగ్‌.. వరంగల్లో ప్రత్యక్షం! తప్పిపోయిన కూతురు ఆచూకీ కనుగొన్నపోలీసులు

వరంగల్‌,ప్రభన్యూస్‌: లక్నోలో తప్పిపోయిన అమ్మాయిని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు హన్మకొండలో గుర్తించారు. కనిపించకుండాపోయిన కన్న కూతురు ఆచూకీ కోసం ఆ కన్న తల్లి చిన్న క్లూ ఆధారంగా హన్మకొండ ఠాణాకు వచ్చి, ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌ జీ సహాయాన్ని ఆర్జించింది. కాలే కడుపును లెక్కచేయకుండా కన్న కూతురు ఆచూకీ కోసం ఆ తల్లి పడుతున్న ఆవేదనను చూసి, హన్మకొండ సిఐ శ్రీనివాస్‌ జీ చలించిపోయారు. కూతురు ఆచూకీ కోసం వచ్చిన తల్లి ఆకలిని తీర్చి, లాడ్జిలో ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత తప్పిపోయిన కూతురుకు వచ్చే బ్యూటీ-షియన్‌, మగ్గం వర్క్‌ ఆధారంగా హన్మకొండ పోలీసులు ఆయా కేంద్రాల్లో అమ్మాయి ఫోటో ఆధారంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇప్పటికే లక్నోకు చెందిన అమ్మాయి తండ్రి అష్రఫ్‌ అలీ తన కూతురు తప్పిపోయిందన్న విషయంలో లక్నోలోని బజారుకాల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో, వారే తమ కూతురు మిస్సింగ్‌ మిస్టరీని ఛేదించాలనుకున్నారు.

సొంత గ్రామానికి చెందిన మగ్గం వర్క్‌, బ్యూటీ పార్లర్‌ వర్క్‌ వచ్చిన సహచరులు బతుకుదెరువు కోసం వరంగల్‌కు పోయారని తెలుసుకున్నారు. ఇక వారితోనే పోయి ఉంటారన్న అనుమానంతో హన్మకొండ పోలీసులను ఆశ్రయించారు. వారి కూతురు ఫోటోతో హనుమకొండలోని మగ్గం, బ్యూటీ పార్లర్లో వెతికి ఎట్టకేలకు కూతురు ఆచూకీని కనుగొన్నారు. అమ్మాయి మిస్సింగ్‌ కేసు లక్నోలో నమోదై ఉండటంతో సంబంధిత లక్నో పోలీసులను రప్పించి, అమ్మాయి తల్లిదండ్రులకు సోమవారం అప్పగించారు. మిస్సింగ్‌ అమ్మాయిని వెతకాడనికి కృషి చేసిన హన్మకొండ ఎస్‌ హెచ్‌ ఓ సి హెచ్‌ శ్రీనివాస్‌ జీ, బ్లూకోర్ట్‌ కానిస్టేబుల్‌ రవిని హన్మకొండ ఏసిపి కిరణ్‌ కుమార్‌ అభినందించారు. ఎంతో దూరము నుండి వచ్చిన తమను ఆదుకొని తమ కూతురును తమకు అప్పగించడంలో సహకరించిన హనుమకొండ పోలీసులకు అష్రఫ్‌ అలీ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ పోలీసులు స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement