Tuesday, November 26, 2024

వోల్నోవఖాపై క్షిపణులు, కీవ్‌, ఖర్కీవ్‌పై దాడులు ముమ్మరం.. జెలెన్‌ స్కీ ఇంటి ఆవరణలో క్షిపణి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఐదున్నర గంటల విరామం తరువాత మళ్లి ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. రష్యా విధించిన కాల్పుల విరమణ సమయం పూర్తి కావడంతో.. మరియుపోల్‌, వోల్నోవఖా ప్రాంతాల్లో దాడులు ప్రారంభం అయ్యాయి. క్షిపణులు, తుపాకులతో విరుచుకుపడింది. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా ఆర్మీ ముందుకు సాగుతున్నది. ఈ నగరానికి సమీపంలోని ఓ గ్రామాన్ని రష్యా తుడిచిపెట్టేసింది. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. దీంతో మరియుపోల్‌కు సమీపంలోని ఓ గ్రామం నామ రూపాల్లేకుండా పోయింది. ఇందులో భాగంగా ఆహారం, విద్యుత్‌, నీరు వంటి సదుపాయాలను అడ్డుకుంటున్నది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మరియుపోల్‌ మేయర్‌ వాదిమ్‌ బాయ్‌ చెన్‌కో కోరారు. ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవద్దని సూచించారు. మరోవైపు శనివారం ఒకే రోజు రష్యా.. 24 క్షిపణులను ప్రయోగించింది.

ఖర్కీవ్‌లో వరుస పేలుళ్లు

శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. స్థానిక ప్రజలు సమీపంలోని షెల్టర్స్‌లోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిపింది. అటు పుతిన్‌ సేనలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేవు. కీవ్‌, ఖర్కీవ్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిసైల్స్‌ను గుర్తించినట్టు జెలెన్‌ స్కీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. నాటో దేశాల సాయంతో ఉక్రెయిన్‌, రష్యాపై విరుచుకుపడుతున్నది. కీవ్‌ సహా ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రతీకార చర్యలకు రష్యా పాల్పడుతున్నది.

రష్యా ఆధీనంలో జపోరిజియా..

ప్రధానంగా ఉక్రెయిన్‌లోని ఇంధన, విద్యుత్‌ సరఫరాలను దెబ్బతీసేందుకు పుతిన్‌ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటును సమీపించి.. శతఘ్నులను ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. జపోరిజియా పూర్తిగా రష్యా సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది. రష్యా దాడులను ఉక్రెయిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా బలగాల్లో 10వేల మందికిపైగా సైన్యం ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ వెల్లడించింది. దీంతో పాటు రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50 మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ ధ్వంసం చేసినట్టు తెలిపింది. 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లు, 409 మోటార్‌ వాహనాలు, రెండు తేలికపాటి బోట్లు, మూడు యూఏవీలను కూడా నాశనం చేసినట్టు వెల్లడించింది.

- Advertisement -

షెల్స్‌, బాంబులతో దాడులు..

స్వల్ప విరామం తరువాత.. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురుస్తున్నది. సుమారు 500 క్షిపణులతో రష్యా ఆర్మీ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్‌ సైన్యం కూడా రష్యా ఆర్మీని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. కీవ్‌, ఖర్కియాతో పాటు ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో.. రక్తపు ధారలు కనిపిస్తున్నాయి. గాయాలతో అల్లాడుతున్న వారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు దర్శనం ఇస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నప్పటికీ.. పుతిన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. షెల్స్‌, బాంబులతో ఉక్రెయిన్‌ నగరాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో.. బరోద్యాంకా, డొనెట్స్‌ నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇరు దేశాల సైనికులతో పాటు వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు చాలా మంది గాయాలపాలయ్యారు. చికిత్స అందక చాలా మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement