Friday, November 22, 2024

నిందితుడిని పట్టించిన మిస్డ్‌ కాల్‌.. 11 సంవత్సరాల బాలిక హత్య జరిగిన 12వ రోజున నేరస్తుడి అరెస్టు

గుర్తు తెలియని నెంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్స్‌ వస్తే ఏదో స్కామ్‌ కాల్‌ అని అంతగా పట్టించుకోరు. సరిగ్గా అదే జరిగింది ఓ తల్లి విషయంలో. ఉదయమే గుర్తు తెలియని నెంబర్‌ నుంచి వచ్చిన మిస్డ్‌ కాల్‌ను ఆ తల్లి పట్టించుకోలేదు. కానీ ఆ కాల్‌ తన కుమార్తెను చంపిన నేరస్తుడిని పట్టుకోవడానికి సహాయపడుతుందని ఎవరు ఊహించలేదు. ఫిబ్రవరి 9న 11 ఏళ్ల బాలిక అపహరణకు గురై హత్యకు గురైన కేసును ఆమె తల్లి ఫోన్‌కు వచ్చిన మిస్డ్‌కాల్‌ ద్వారా పోలీసులు ఛేదించారు. ఢిల్లిలోని నాంగ్లోయ్‌ ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక అదృశ్యమైన రోజు ఆమె తల్లికి గుర్తు తెలియని నెంబర్‌ నుండి మిస్డ్‌ కాల్‌ వచ్చింది. అది మర్డర్‌ మిస్టరీని చేధించింది.

ఆ మిస్డ్‌ కాల్‌ ఆధారంగా నేరస్తుడిని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన 12 రోజులకు రోహిత్‌ అలియాస్‌ వినోద్‌ అనే నేరస్తుడిని అరెస్టు చేశారు. కిడ్నాప్‌ చేసి హత్యకు గురైన బాలిక ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం పాఠశాలకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. అయితే కూతురు కిడ్నాప్‌ అయిన రోజు ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి గుర్తు తెలియని నెంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ వచ్చింది.

ఆమె తిరిగి కాల్‌ చేయగా నెంబర్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. పోలీసుల విచారణ సాగుతుండగా చిన్నారి తల్లి మిస్డ్‌ కాల్‌ గురించి చెప్పారు. ఆ నెంబర్‌ ఆధారంగా హంతకుడు రోహిత్‌ (21)ను అరెస్టు చేశారు. నిందితుడిని ఫిబ్రవరి 21న పట్టుకుని విచారించగా నేరం అంగీకరించి ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రామోర్‌ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. ముండ్కా గ్రామంలో కుళ్ళిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement