Tuesday, November 26, 2024

ఎస్సైపై ఆక‌తాయిల దురుసుతనం.. మ్యారేజ్ భారాత్ లో మందుబాబుల హల్ చల్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : ఓరుగల్లులో పోకిరీలు తమ వెకిలిచేష్ట‌లతో రెచ్చిపోతున్నారు. ఆకతాయిల అల్లర్లతో ఆగమాగం చేస్తున్నారు. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు ముగిసిన తర్వాత జరుపుకొనే బారాత్ వివాహదాస్పదంగా తయారవుతోంది. మ్యారేజీ తర్వాత జరిగే పెళ్ళి ఊరేగింపు తంతులో డిజే సౌండ్స్ ఏర్పాటు చేసి,స్టేటస్ సింబల్ గా చాటుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లి బారాత్ లో పాల్గొనే యువకులు మద్యం మత్తులో జోగుతూ వికృత డ్యాన్స్ ల పేరుతో రచ్చరచ్చ చేస్తున్నారు. మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారోననే…విచక్షణను కోల్పోతున్నారు.

పెళ్లి బారాత్ లో వినియోగించే డి జే సౌండ్స్ ను రాత్రి 10 గంటల వరకే వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ షరతు విధించారు. రాత్రి 10 తర్వాత డి జే సౌండ్స్ వాడకూడదనే నిషేధం అమలు చేస్తున్నట్టు పోలీస్ బాస్ ప్రకటించారు. కానీ ఓరుగల్లు మహా నగరంలో అమలు కావడం లేదు. డయల్ 100 కు పెళ్ళిళ్ళ సీజన్ లో ఫిర్యాదులు పెరిగి పోతున్నాయి. డి జే సౌండ్స్ నిర్వాహకులను కట్టడి చేయక పోవడం వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతోంది. సరిగ్గా ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ లోని శ్రీనగర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత డి జే సౌండ్స్ మోతలపై డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు హన్మకొండ ఎసై రాజు నైట్ పోలీస్ వాహనంలో పెళ్లి బారాత్ వద్దకు చేరుకున్నారు. ఎసై డి జే సౌండ్స్ మోతలను నిలిపివేయాలని పెళ్ళివారిని కోరారు. డయల్ 100 కాల్ వచ్చిందని కూడ ఎలియజేశారు.కానీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత మద్యం మత్తులో యువకులు ఎసై రాజు పైకి తిరగబడ్డారు. చేతులతో నెట్టివేస్తూ, దాడి చేసే ప్రయత్నం చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాత్రి 10 తర్వాత డి జే సౌండ్స్ పై నిషేధం అమలు చేయకుండా ఉల్లంఘించారు.

- Advertisement -

అదీగాక విధి నిర్వహణలో ఉన్న ఎసై పై అనుచితంగా ప్రవర్తించారు. ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ ను మద్యం మత్తులో నెట్టివేస్తూ, చెయ్యి చేసుకొనే ప్రయత్నాలు చేసి, భీభత్సం సృష్టించారు. ఈ సంఘటనపై 4 గురిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టిన్నట్లు హన్మకొండ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ జీ తెలిపారు. డి జే సౌండ్స్ ను రాత్రి 10 గంటల తర్వాత వాడకూడదని తెలిపారు. అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement