ఉత్తరాది రాష్ట్రాలను చలి గాలులు వణికిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లి సహా ఉత్తర ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. జమ్ము-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ తదితర 11 రాష్ట్రాలలో శీతల గాలుల తీవ్రత అధికంగా ఉంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 5కి చేరుకున్నది. పహల్గావ్‌లో మైనస్ 6.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. బీహార్‌లో అకాల వర్షాలకు ఇద్దరు చనిపోయారు. భాగల్‌పూర్‌లో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
చలిగాలుల దృష్ట్యా, బీహార్‌లోని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేశారు. మరోవైపు హర్యానాలోనూ ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీలకు చేరుకున్నాయి. ఢిల్లిలో ఉదయం 11 గంటలు దాటినా రోడ్లపై వాహనాలు, ప్రజలు కనిపించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో వర్షాలు, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.