ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో ఉంటున్న 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది. బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. పాఠశాలలో ఓ సీనియర్ విద్యార్ధి తాను గర్భం దాల్చడానికి కారణమని చెప్పింది. ఈ బాలుడిని విచారించగా తాను కాదని చెప్పాడు. బాలిక, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదని, మరో విద్యార్థి పేరు కూడా చెబుతోన్న కారణంగా అందరినీ విచారిస్తామని పోలీసులు తెలిపారు.