కరోనా టీకా కొవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలాకు భద్రత పెంచుతూ.. కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పూనావాలాకు దేశమంతటా సీఆర్పీఎఫ్ ద్వారా వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నందున భద్రత పెంచింది. ఇందులో భాగంగా ఆయనకు రక్షణగా నిరంతరం ఇద్దరు కమాండోలు సహా మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
కొవిషీల్డ్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ ఏప్రిల్ 16న ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వెంటనే పూనావాలాకు భద్రత కల్పించాలని కోరారు. మహమ్మారిని అంతమొందించేందుకు మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని లేఖలో ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూనావాలాకు భద్రత పెంచుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది.
కాగా, భారత్ లో అందుబాటులోకి వచ్చిన రెండు కరోనా టీకాల్లో కొవిషీల్డ్ ఒకటి. దీన్ని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించగా.. భారత్ లోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.