Sunday, November 24, 2024

నితీశ్‌ కంటే మంత్రులే సంపన్నులు.. బీహార్‌ సీఎం ఆస్తుల విలువ రూ.75 లక్షలే

బీహార్‌ రాష్ట్రంలోని కేబినెట్‌ మంత్రులు తమ ఆస్తులను ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తోపాటు మిగతా మంత్రులు తమ తమ స్థిర, చరాస్తుల వివరాలను బహిర్గతం చేశారు. ఈ వివరాల ప్రకారం సీఎం నితీశ్‌ కంటే అతని సహచర మంత్రులు కొందరు ఎక్కువ ఆస్తులు కలిగివున్నట్లు తేలింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద రూ.16.68 లక్షల చరాస్తులు, రూ.58.85 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. నితీశ్‌ చేతిలో రూ.28,135 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.50వేలు, లక్షకుపైగా విలువైన నగలు ఉన్నాయి. 12 ఆవులు, 10 దూడలు ఉన్నట్లు ముఖ్యమంత్రి సచివాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచబడింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారులు సహా ఇతర మంత్రులు తమ ఆస్తులను ప్రకటించారు. డిప్యూటీ సీఎం వద్ద రూ.5.3 లక్షల విలువైన బాండ్లు, షేర్లలో పెట్టుబడులు ఉన్నాయి.

ఆహార, వినియోగదారుల మంత్రి లెస్సీ సింగ్‌కు కోటి కంటే ఎక్కువ ఆస్తి కలిగివున్నారు. ఆమె వద్ద రైఫిల్‌, 12 బోర్‌గన్‌ ఉన్నాయి. ఆమెకు రూ.1.5 కోట్ల వివువైన 10 ప్లాట్లు కూడా ఉన్నాయి. జలవనరుల మంత్రి సంజయ్‌ కుమార్‌ ఝా కూడా కోటీశ్వరుడే. ఆయన భార్య పేరుమీద రూ.5.25 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. పరిశ్రమల మంత్రి సమీర్‌ కుమార్‌ మహాసేత్‌కు రూ.7కోట్లకుపైగా ఆస్తులున్నాయి. విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ ఆస్తుల విలువ రూ.1.96కోట్లు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రి అనితాదేవి ఆస్తుల విలువ రూ.1.24 కోట్లు. ఆమెకు కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూమి కూడా ఉన్నది. సాంఘిక సంక్షేమ మంత్రి మదన్‌ సాహ్నికి రూ.2.58 కోట్ల ఆస్తులున్నాయి. భవన నిర్మాణశాఖ మంత్రి అశోక్‌ చౌదరి ఆస్తుల విలు రూ.4.42 కోట్లు, సాంస్కృతిక మంత్రి ఆస్తుల విలువ రూ.3.65కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement