న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో నైపుణ్యాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వివరాలు, పీఎంకేవీవై, సంకల్ప్, స్టార్, ఉడాన్ వంటి పథకాలలో శిక్షణ పొందిన యువత సంఖ్య, ఉద్యోగావకాశాలు, జీవనోపాధి పొందిన వారి వివరాలు అందించవలసినదిగా వైసీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖా మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. స్కిల్ ఇండియా మిషన్ కింద మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆంద్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా యువత నైపుణ్యాభివృద్ధికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాలను పారిశ్రామిక శిక్షణా సంస్థలు, జన శిక్షణ సంస్థాన్, క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్‌లను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో జిల్లాల వారీగా 671 పీఎంకేవీవై 2.0, 3.0 కేంద్రాలు, 7 జనశిక్షణ సంస్థాన్ కేంద్రాలు, 510 ఐటీఐ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా పీఎంకేవీవైలో 4,56,731 మందికి, జన శిక్షణ సంస్థాన్ ద్వారా 35,942 మందికి ఐటీఐలలో 4,30,490 మంది అభ్యర్దులు శిక్షణ పొందారని కేంద్రమంత్రి తెలిపారు. జమ్మూ & కాశ్మీర్ యువత కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఉడాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. స్టార్ స్కీమ్ అని పిలవబడే నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్, మానిటరీ రివార్డ్ స్కీమ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేసిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది అభ్యర్థులు శిక్షణ పొందారని ఆయన వివరించారు. సంకల్ప్ కింద స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎటువంటి నిబంధనలు లేవని,మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన గ్రామాలలో కార్మికులకు సర్టిఫికెట్లను అందిస్తున్నట్టు తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 596 మంది అభ్యర్థులు శిక్షణ పొందారని చెప్పారు.
స్వయం సహాయక సంఘాల కేంద్ర పూర్తి మద్దతు
స్వయం సహాయక సంఘాల పనితీరుపై ప్రశ్నించిన ఎంపీ బీద మస్తాన్ రావుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖా మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానమిచ్చారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందం సభ్యులు మెరుగైన వ్యవసాయ పద్దతులు అవలంభించడానికి అవగాహన కల్పించామన్నారు. వ్యవసాయ – పర్యావరణ పద్ధతులు, పాడి పరిశ్రమ, సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూడా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారని కేంద్రమంత్రి వివరించారు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమన్వయంతో స్వయం సహాయక గ్రూపులకు లబ్ది చేకూరుతోందని కేంద్రమంత్రి తెలిపారు.
జస్టిస్ రోహిణితో భేటీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొంటున్న బీద మస్తాన్ రావు మాజీ న్యాయమూర్తి, వెనుకబడిన వర్గాల కమిటీ ఛైర్ పర్సన్ శ్రీమతి రోహిణిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీల సమస్యలు, వారి జీవన విధానాల గురించి ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలలో ఎదుర్కొంటున్న వివక్షను జస్టిస్ రోహిణి దృష్టికి తీసుకెళ్లారు. మస్తాన్ రావు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని ఆమె అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.