Saturday, November 23, 2024

GST పై 25న మంత్రుల ప్యానల్‌ భేటీ !

జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం సెప్టెంబర్‌ 25న సమావేశం కానుంది. పన్ను శ్లాబ్‌లు, రేట్ల సర్దుబాటుపై చర్చించనుంది. రేట్ల హేతుబద్ధీకరణపై ఈ సమావేశం సెప్టెంబర్‌ 25న గోవాలో జరగనుందని ఓ అధికారి తెలిపారు. బీహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల బృందం చివరిసారిగా ఆగస్టు 22న సమావేశమైంది.

సెప్టెంబర్‌ 9న జీఎస్‌టీ కౌన్సిల్‌కు నివేదికను సమర్పించింది. కొన్ని వస్తువులపై పన్ను రేటు మార్పును విశ్లేషించడానికి, మరింత డేటాను సేకరించే బాధ్యతలను కేంద్రం-రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులకు ఫిట్‌మెంట్‌ కమిటీ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం, వస్తుసేవల పన్ను నాలుగంచెల్లో 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌లను కలిగివుంది.

12, 18 శాతం పన్ను శ్లాబుల విలీనంపై చర్చలు జరిగినా ఇంతవరకు ఏమీ ప్రతిపాదించలేదు. సగటు జీఎస్టీ రేటు దాదాపు 12 శాతంగా ఉంది. ఇది ఆదాయ తటస్థ రేటు 15.3 శాతం కంటే దిగువకు పడిపోయింది. దీంతో జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది.

పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలు జీఎస్‌టీ శ్లాబ్‌లలో క్రమబద్ధీకరణకు సానుకూలంగా లేవు. పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆగస్టు సమావేశంలో ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. ఇక కర్నాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ మాట్లాడుతూ జిఎస్‌టి వ్యవస్థకు అంతరాయం కల్గించాల్సిన పనిలేదన్నారు. ఆరుగురు సభ్యుల మంత్రుల కమిటీలో ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా, రాజస్థాన్‌ ఆరోగ్య సేవల మంత్రి గజేంద్ర సింగ్‌, కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement