Tuesday, November 26, 2024

TG | రాయదుర్గం టైమ్స్‌ స్క్వేర్‌ డిజైన్లను సమీక్షించిన మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ : హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతంలోని రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఐకానిక్‌ టైమ్స్‌ స్క్వేర్‌ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమీక్షించారు. ఈ సందర్బంగా డిజైన్లలో పలు మార్పులను సూచించారు.

దీనిపై ఇప్పటికే టెండర్‌ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తాము డిజైన్‌ చేసిన నిర్మాణాల ప్రెజెంటేషన్లను గురువారం సచివాలయంలో ఆయన సమక్షంలో ప్రదర్శించాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలో 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా టీస్ఖ్క్వేర్‌ను రూపొందించాలని శ్రీధర్‌ బాబు కోరారు.

భారీ ఎలక్ట్రానిక్‌ డిస్ల్పేలు, డిజిటల్‌ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు, గాయకుల సందడి ఉండాలని శ్రీధర్‌ బాబు చెప్పారు.

24 గంటలూ తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్‌ మాల్స్‌ ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ కె.శ్యామ సుందర్‌ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement