హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరికల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందన్నారు. బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి..? అన్నది తేలుతుందన్నారు. దాదాపు 20వేల ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.
ఈ విషయమై శాసన మండలిలో లాంజ్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిందే కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పూర్తిస్తాయి అధికారి వచ్చే వరకు నవీన్ మిట్టల్ కొనసాగుతారని మంత్రి సబిత స్పష్టం చేశారు. బోర్డు కార్యదర్శి స్థాయి పోస్టును ఖాళీగా ఉంచలేము కదా..? అని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి అధికారి వచ్చేంత వరకు ఇంటర్ బోర్డు వ్యవహారాలను నవీన్ మిట్టల్ చూస్తారని స్పష్టం చేశారు.