(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : నూతన సంవత్సరంలో ఒక నుతన విధానానికి శ్రీకారం చుట్టాలనే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుకు నాయకులు, అధికారుల నుండి విశేష స్పందన లభించింది. నూతన సంవత్సరము సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిని కలిసిన వారు నోట్ పుస్తకాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ నేతలతో పాటు,జిల్లాల నుండి వచ్చిన నాయకులు, అధికారులు మంత్రికి బొకేలు, శాలువల స్థానంలో నోట్ పుస్తకాలు అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు బొకేలు, శాలువలు తీసుకురావొద్దనే మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆదివారం శ్రీనగర్ కాలనీతోపాటు మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసిన నేతలు నోట్ పుస్తకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. ఇవి పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు ఇదే విధానాన్ని పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, అంగన్ వాడి పిల్లలకు అవసరం అయ్యే వాటిని ఇవ్వటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, తనతో పాటు ఎవరిని కలిసిన ఇదే విధంగా ముందుకు వెళ్లాలని.. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని కోరారు.తనకు వచ్చిన నోట్ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు.