ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమయింది. శుక్రవారం నుండి దేశ వ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్న నేపద్యంలో ముస్లిం సోదర, సోదరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ‘గంగ జమునా తెహజీబ్’ మరింతగా పరిఢవిల్లాలన్నారు. దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారని, తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష ముగుస్తుందన్నారు. ఉపవాసం ఆచరిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం సాయంత్రం నమాజ్ అచరించుకోవడానికి వెసులుబాటు కల్పించిందని గుర్తు చేశారు. పరమ పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన ఈ మాసంలో ప్రపంచంలోని ముస్లింలందరూ ఉపవాస దీక్షలో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో భక్తిప్రపత్తులు, ఏకాగ్రత, ఆత్మను క్రమపద్దతిలో ఉంచుకుని క్రమశిక్షణలతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి పెట్టింది పేరని మంత్రి పువ్వాడ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారన్నారు. రంజాన్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి, మరమ్మతులకు నిధులిస్తున్నామన్నారు. పేదలకు దుస్తుల పంపిణీతో పాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పువ్వాడ వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement