ఖమ్మం : దేశానికి బీజేపీ రూపంలో తీవ్ర ప్రమాదం పొంచి ఉందనీ, శత్రువును ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా కష్టజీవులకు అండగా ఉండేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. పంటలు దెబ్బతిన్న క్రమంలో నష్టాన్ని అంచనా వేయడానికి ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సాగుదారులలో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారనీ, వారికి పంట నష్ట పరిహారం అందేలా చూడాలని సూచన చేశారన్నారు. వెంటనే కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కార్పొరేట్ల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై దాడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తలపెట్టిన జనచైతన్య యాత్ర గురువారం ఖమ్మం నగరానికి చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నిరంతరం ప్రజల్ని చైతన్యపరుస్తూ కష్టజీవుల పక్షాన కమ్యూనిస్టులు నిలుస్తున్నారన్నారు. కార్మికుల, కర్షకుల కష్టాలు దగ్గరగా చూస్తూ వారికి న్యాయం చేయాలని కొట్టాడుతున్న తీరు ఎప్పటికీ ఆదర్శనీయమేనన్నారు. వారు న్యాయం ఉంటారనేది సహజ సూత్రమన్నారు. ఖమ్మం జిల్లాకు పూర్వ వైభవం రావాలనీ, వామపక్ష పార్టీల నేతలు చట్టసభలకు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు సీఎం కేసీఆర్ ఏ సీట్లు ఇచ్చినా తాము దగ్గరుండి గెలిపించుకుంటామన్నారు. ఖమ్మం జిల్లాను వామపక్షాలు – బీఆర్ఎస్ కంచుకోటగా మార్చాలన్నారు. తానూ కష్టజీవులకు అండగా ఉండే కుటుంబం నుంచే వచ్చాననీ, పేదలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలతో ఉన్న ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. దేశంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, సహజవనరులను గంపగుత్తగా మోడీ సర్కారు కట్టబెడుతున్నదని విమర్శించారు. ఎస్బీఐ, ఎల్బీసీ సంస్థలకు వేల కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టిన ఆదానీ ఆక్రమాలపై జేపీసీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ సంస్థలు దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించేందుకు వాడుకుంటున్న తీరును వివరించారు. బీజేపీని వెనక్కి కొట్టేందుకు ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మోడీకి దేశాన్ని క్షణం కూడా పరిపాలించే అర్హత లేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చొప్పున చూస్తే తొమ్మిదేండ్ల కాలంలో 18 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉన్నదన్నారు. అలాగైతే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదన్నారు. కానీ, మోడీ పాలనలో నిరుద్యోగ రేటు గరిష్టస్థాయికి చేరిందన్నారు. తనను గెలిపిస్తే విదేశాల నుంచి 80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2022 కల్లా అందరికీ ఇండ్లు కట్టిస్తామనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ సర్కారు నిండా ముంచిందని విమర్శించారు. అంబానీ, అదానీలకు మార్కెట్లు, వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు మూడు నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. ఢిల్లీలో రైతులు సుధీర్ఘంగా పోరాటం చేసి మోడీ చేత క్షమాపణ చెప్పించారన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెడతానన్న మోడీ ప్రపంచ దేశాల ముందు దేశగౌరవాన్ని తీస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు మతం, కులం, ఆహారపు అలవాట్ల పేరుతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కారు రాజ్యాంగంపై దాడిని తీవ్రతరం చేసిందనీ, లౌకిక ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడుస్తున్నదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు మనుధర్మాన్ని రాజ్యాంగం అమలు చేయాలని చెప్పగా నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని అనుసరిస్తోందన్నారు. బీసీ కుల గణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుంటే బీసీ ప్రధాని అని చెప్పుకునే మోడీ కనీసం స్పందించడం లేదని విమర్శించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నదన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని బీజేపీలో చేరుతారా? జైలుకెళ్తారా? అని బెదిరిస్తున్న తీరును వివరించారు. అసలు ప్రొడక్షనే లేని అదానీ కంపెనీల ద్వారా అతనికి రూ.17 లక్షల కోట్ల ఆదాయం ఎట్టా పెరిగిందని ప్రశ్నించారు. ఆయనపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. మునుగోడులో బీజేపీ ఓటమి కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమైందనీ, భవిష్యత్తులోనూ ఆ పార్టీని అడ్డుకుంటామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ..మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని దేశం నుంచి పారదోలటమే తమ లక్ష్యమన్నారు. వాల్మార్టు, డీమార్డు రాకతో ఖమ్మం నగరంలో చిరువ్యాపారులు, దుకాణదారులు జీవనోపాధిని కోల్పోతున్న క్రమాన్ని వివరించారు. మార్కెట్ వ్యవస్థ అంబానీ, అదానీ చేతుల్లోకి వెళ్తే సామాన్యులు బతకడమే కష్టం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య యాత్ర బృంద నాయకుడు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్, కోట రమేశ్, యర్రా శ్రీకాంత్, సీపీఐ, సీపీఐ(ఎం), బీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గన్నారు.