ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే- బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎట్టకేలకు ఇవ్వాల తన మంత్రివర్గంతో కొలువుదీరింది. అయితే.. ఈ కేబినేట్ కూర్పు తర్వాత శివసేన రెబల్ ఎమ్మెల్యే తీరుపై బీజేపీలోని మహిళా నేతలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ ఎంపిక తీవ్ర రచ్చకు దారి తీసింది.
ఎందుకంటే సంజయ్ రాథోడ్ గతంలో ఉద్దవ్ గర్నమెంట్ లో మంత్రిగా ఉన్నప్పుడు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని.. ఆమె అత్మహత్యకు కారణమైనట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సంజయ్ రాథోడ్‌ని బలవంతంగా రాజీనామా చేయించారు.
ఇక.. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ శివసేనపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసీ సంజయ్ ను రాజీనామా చేయించింది. బీజేపీ నుండి మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాగ్ ఆ బాధిత మహిళకు అండగా పోరాటం చేశారు. కానీ, ఇప్పుడు అదే బీజేపీ నేతలు ఓ మహిళ చావుకు కారణమైన అదే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారు.
దీంతో పార్టీ ఉపాధ్యక్షురాలు చిత్ర తీవ్రంగా స్పందిచారు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలోనే సంజయ్ రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్. ఇంకోవైపు ఎక్ నాథ్ షిండే కూడా రాథోడ్ ను కొంతకాలంగా వెనకేసుకొస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేస్తూ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారనే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుండడం గమనార్హం.