Saturday, November 16, 2024

TG | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి ముందు మొద్దునిద్ర విడిచిపెట్టాలని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేపట్టారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మూసీ కాలువ వాసన చూసి అయినా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు.

‘రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చావా..? మీరు అసలు తెలంగాణ బిడ్డేనా.. మీరు ఒక్కసారి డీఎన్ఏ పరీక్ష చేసుకోండి. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఎలా పాస్ అయ్యిందో మీకు తెలుసా..? ఆ రోజులు మరచిపోయారా అని’ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు.

‘రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మీరు వ్యతిరేకిస్తున్నారా..? కలెక్టర్‌పై దాడిని ఖండించని మీరు కేంద్రమంత్రిగా ఉండే అర్హత కోల్పోయారు. కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారు, చేయించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై మీ వైఖరి ఏంటో చెప్పాలి. మీ పార్టీ స్టాండ్ ఏంటో బహిరంగపరచాలి. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశావ్. ఎంపీగా సికింద్రాబాద్‌కు ఏం చేశావ్. ఇదే అంశంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రా అని’ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement