Saturday, September 21, 2024

TG | రేపు రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి పొంగులేటి భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగులతో వరుస భేటీలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో (శనివారం) ఉదయం 11గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు రెవెన్యూ శాఖను, ఉద్యోగులను గత ప్రభుత్వం చిన్నచూపు చూసి నిర్లక్ష్యం ప్రదర్శించిదనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. రెవెన్యూ శాఖను, ఈ శాఖలోని ఉద్యోగులను అనేక రకాలుగా అపప్రదకు గురిచేశారనే ఆరోపణలు గత ప్రభుత్వంపై తీవ్రస్థాయికి చేరాయి.

చివరకు రెవెన్యూ శాఖకే ఉనికినే దెబ్బ తీస్తూ అస్తిత్వాన్నే కోల్పోయేలా చేసిందని ఉద్యోగులు గుర్తుగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు రెవెన్యూ శాఖ బలోపేతానికి కృషి జరుగుతుందని విశ్వాసంతో ఉన్నారు.

- Advertisement -

అందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఉదయం 11గంటలకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో భేటి కానున్నారు. సచివాలయంలో మంత్రి, ఉద్యోగ సంఘాల నాయకులు భేటి కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ భేటీపై రెవెన్యూ ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. కీలక అంశాలపై సుదీర్గంగా చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడం, కొత్త చట్టం, వీఆర్‌ఏ, వీఆర్వో, బదలీలు, పదోన్నతులు తదితర అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement