Wednesday, November 20, 2024

తిరుపతిలో దొంగ ఓట్ల ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

తిరుప‌తిలో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి స్పందించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మ‌ద్దతు లేక‌పోవ‌డంతోనే దొంగ ఓట్లు అంటూ త‌మ‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిప‌డ్డారు. ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల‌ ఆరోప‌ణ‌ల‌ డ్రామాను ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు. తిరుపతికి ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారిని ప‌ట్టుకుని దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. తిరుపతి యాత్రా స్థలం కావడంతోనే ఆ ప్రాంతానికి ప్రైవేటు బస్సులు వస్తాయ‌ని, ఆ బస్సులను వైసీపీవిగా చిత్రీకరించడం కుట్ర‌పూరిత‌మేన‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త‌న‌పై ఇష్టం వచ్చినట్లు ఆరోప‌ణ‌లు చేస్తూ ఊరుకోనని హెచ్చరించారు. విపక్ష నేతల వైఖరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

రాజకీయ లబ్ధి కోసమే త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత‌ చంద్రబాబు కుట్రలకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తనని వీరప్పన్‌ తో పోలుస్తూ లోకేశ్ ట్వీట్ చేశారని.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. నారా లోకేశ్‌ కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. ఇతర పార్టీలో గెలిచిన వారికి పదవులు ఇచ్చింది ఎవరని..? పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 

కాగా, తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద‌యం 7 గంట‌ల‌ నుంచే ఇత‌ర ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి వైసీపీ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆయన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement