ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అక్టోబర్ 6న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించనున్నారు.
హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కేటీఆర్ చేతుల మీదుగా జరుగనున్నాయి. వంద కోట్ల రూపాయలతో 35 ఎ్టాట్ ఫామ్స్ జిప్లస్ వన్ పద్దతిలో హన్మకొండ బస్ స్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
స్మార్ట్ సిటీ రోడ్లప్రారంభోత్సవంతోపాటు ఆరు జంక్షన్లను ప్రారంభిస్తారు. ఏడున్నర కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 50వేల మందితో హన్మకొండలోని కుడా మైధానంలో భారీ బహిరంగ సభను నిర్వహించుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
వరంగల్ తూర్పులో 15వేల మందికి సంక్షేమ పథకాలు.. 60వేల మందితో భారీ బహిరంగ సభ
అక్టోబర్ 6న యువనేత, ఐటి,పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా 15వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను బహిరంగ సభ వేదికపై నుంచి అందించబోతున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు.
వరంగల్ తూర్పులో 4100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 1100 కోట్ల రూపాయలతో 24 అంతస్తులతో మల్టి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని, దళిత కాలనీల మధ్యన వరంగల్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 360 కోట్ల రూపాయల వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారని నరేందర్ తెలిపారు.
ఖిలా వరంగల్లో వాకర్స్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిననంతరం నరేందర్ మీడియాతో మాట్లాడారు. 15వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బహిరంగ సభ వేదిక నుంచి అందిస్తారని, పథకాలను తీసుకునేందుకు లబ్ధిదారులు తమ సకుటుంబ సపరివారంగా 60వేల మంది తరలి వచ్చి యువనేత కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.