Monday, November 18, 2024

పుట్టినగడ్డ రుణం తీర్చుకోండి, అభివృద్ధిలో భాగం పంచుకోండి.. ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఇక్కడి ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు నమస్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన విజయాలను ఈసందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చూపిన ఉద్యమస్ఫూర్తినే నేటికి కొనసాగిస్తూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగానాన్నే వినిపిస్తున్నారని ఎన్నారైలను కేటీఆర్‌ ప్రశంసించారు.

ఈ పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో తాను జరపిన సమావేవేశాలు సంతృప్తికరంగా సాగాయని తెలిపారు. త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తమ ప్రథమ కర్తవ్యం అని కేటీఆర్‌ చెప్పారు. రాబోయే కాలంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న నమ్మకం తనకుందన్నారు. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలని ఎన్నారైలను ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌తో పాటు మిగతాపట్టణాలు, నగరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని వికేంద్రీకరించామని తెలిపారు. అదులో భాగంగానే ఖమ్మం, కరీంనగర్‌ ఐటీ టవర్స్‌ను ప్రారంభించామని త్వరలోనే మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీతో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలువిజయవంతంగా కొనసాగుతాయన్నారు.

సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంటుతో పాటు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందన్నారు. కేవలం నాలుగు ఏళ్లలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్నిపూర్తిచేయడం కేసీఆర్‌ కార్యదక్షతకు నిదర్శనమన్నారు. తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉండడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమన్నారు. సార్టప్‌గా మొదలైన తెలంగాణ రాష్ట్ర విజయప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోందన్నారు. 2014లో లక్షా 24 వేల రూపాయాలుగా ఉన్న తలసరిఆదాయం కేవలం ఏడేండ్ల కాలంలోనే 130 శాతం పెరిగి రెండు లక్షల 78 వేల రూపాయలకు చేరడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 2014లో 5 లక్షల 60 వేల కోట్లు ఉన్న రాష్ట్ర జీడీపీ ప్రస్తుతం 11 లక్షల 54 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదని, భారత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందన్నారు.

విస్తీర్ణంగా చూసుకుంటే దేశంలో తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రమని, కానీ ఆర్ధిక వ్యవస్థలో వాటాలో నాలుగవస్థానంలో ఉందన్నారు. తెలంగాణ సాధిస్తున్న నిరంతర ఆర్ధిక వృద్ధి ఇక్కడి సుస్థిర పాలన, శాంతియుత వాతావరణం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రాన్‌, ఆపిల్‌, క్వాల్‌కమ్‌, ఉబర్‌, సేల్స్‌ఫోర్స్‌, నోవార్టిస్‌లు అమెరికా అవతల తమ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఏడు సంవత్సరాల్లోనే ఇవన్నీ జరిగాయన్నారు. తెలంగాణ సాధిస్తున్న ఈ ప్రయాణాన్ని తెలంగాణ ఎన్నారైలు మరింత ముందుకు తీసుకుపోవాలని ఎన్నారైలు మరింత ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలని కేటీఆర్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement