ప్రభన్యూస్, హైదరాబాద్: బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి కె.తారాక రామారావును ఫిల్లర్ నంబరు -248 సమీపంలో నివసిస్తున్న ఉమర్ అనే బాలుడు తమకు నల్లా నీళ్లు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఫ్లకార్డు పట్టుకుని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా వీడియో స్థానిక సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీంతో బాలుడు ఉమర్ వినితికి మంత్రి స్పందించి.. వారు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని వాటర్‌బోర్డు ఎం.డి ఎం.దానకిషోర్‌కు సూచించారు. వెంటనే వాటర్‌బోర్డు ఎం.డి ఎం.దానకిషోర్ హుటాహుటిన గోల్డెన్ సిటీకి వెళ్లి.. బాలుడు ఉమర్‌తో పాటు కాలనీవాసులతో మాట్లాడి..సమస్యపై ఆరా తీయడం గమనార్హం.
రెండు వారాల్లో కుళాయి నీళ్లు సరఫరా: వాటర్‌బోర్డు ఎం.డి దానకిషోర్
రెండు వారాల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి నల్లా ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని వాటర్‌బోర్డు ఎం.డి ఎం.దానకిషోర్ హామినిచ్చారు. అప్పటి వరకు గోల్డెన్ సిటీ కాలనీకి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేపడతామన్నారు. అయితే బాలుడు ఉమర్ తమ కాలనీ నీటి సమస్యను వెల్లడించిన కేవలం నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్ స్పందించడంతో పాటు..వాటర్‌బోర్డు ఎం.డి దానకిషోర్ నేరుగా గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి..తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. దీంతో వాటర్‌బోర్డు ఎం.డిని అభినందిస్తూ…’వెల్‌డన్ ..ఎండి గారూ..’ అంటూ.. మంత్రి మరో ట్వీట్ చేశారు.
ఈ సంగతి పక్కనుంచితే.. ఇప్పటికే గోల్డెన్ సిటీ కాలనీకి ఓఆర్‌ఆర్ ప్యాకేజీ-2లో భాగంగా నల్లా పైప్‌లైన్ వేయడానికి రూ.2.85 కోట్లు మంజూరు చేశామని వాటర్‌బోర్డు అధికారులు అంటున్నారు. అయితే వర్షాకాల జాగ్రత్తల్లో భాగంగా గత అక్టోబర్ 31 వరకు రోడ్డు తవ్వడానికి వీలు లేకుండా జీహెచ్‌ఎంసీ నిషేదాజ్ఞలుండటంతో పైప్‌లైన్ పనులు ఆలస్యం అయ్యాయని చెప్పుకొస్తున్నారు. ఏదీ ఏమైనా బాలల దినోత్సవం రోజున ఉమర్ చేసిన సాహసంతో.. స్థానిక కాలనీ వాసుల మంచినీటి సమస్యకు తీరబోతుండటంతో.. కాలనీ వాసులు ఆనందంతో మునిగిపోవడం గమనార్హం.