హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉండే హైటెక్ సిటీ వద్ద నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని సోమవారం నాడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 410 మీటర్ల పొడవు, 20.60 వెడల్పు కలిగిన ఈ బ్రిడ్జిని రూ.66.59 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అంతకుముందు మూసాపేటలో బీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డు వరకు ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కరోనా వైరస్ ఇంకా పోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. కరోనా కేసులు తగ్గాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అటు నగర శివారు మున్సిపాలిటీల్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.