స్యూర్యాపేట, ప్రభన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి నిర్వహించే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. 54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని కోరారు. మంత్రులు, శాసనసభ్యులు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈనెల 12లోగా జిల్లా స్థాయిలో మంత్రులు కంటి వెలుగుపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. జనవరి 18న ప్రతి నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రారంభించే గ్రామాలను ఎంపిక చేయాలని కోరారు. కంటి వెలుగు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల వృద్ధులకు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి తదితరులు మాట్లాడారు.