తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక వైపు అవార్డులు ఇస్తూనే.. మరో వైపు అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.. గల్లీలో రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడాలన్నారు. 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చిన నివేదికలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రాజకీయాలు చేయాలనుకుంటే నిధులు ఇచ్చి మాట్లాడాలి.. విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ఆఫీసులో మంత్రి హరీశ్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకం దేశమంతటా ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement