మాజీ మంత్రి ఈటెలపై మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈటెలను హత్య చేయాలని ప్రయత్నిస్తున్న మంత్రి పేరు బయటపెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే ఈటెల ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెలతో తమకు రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో భౌతిక దాడులు, హత్యల సంస్కృతి లేదన్నారు. ఈటెల ప్రాణాలకు ఎలాంటి భయం లేదని, ఆయన నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈటెల చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డీజీపీ కోరుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈటెల ఆయన మద్దతుదారులతోనే దాడి చేయించుకుని ప్రభుత్వంపై నెట్టివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటెల బయట పెట్టాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. విచారణలో తన పేరు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని… ఒకవేళ ఈటెల వ్యాఖ్యల్లో నిజం లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్త కూడా చదవండి: రేపు టీఆర్ఎస్‌లో చేరనున్న కౌశిక్ రెడ్డి