దేశ వ్యాప్తంగా కరోనా సెకవండ్ వేవ్ విస్తరిస్తోంది. తెలంగాణలో కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరం విధిగా వాక్సిన్ వేయించు కోవాలని సూచించారు.
పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని, ఆయా రాష్ట్రాల నుండి గ్రామాల్లోకి వచ్చే వారిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడికి, మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాస్కులు ధరించాలని, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు భౌతిక దూరం పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. అవసరం ఉంటే తప్ప ఇంటినుండి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.