Tuesday, November 26, 2024

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు స్వరం

ఏపీ రాజకీయాల్లో అధికారపార్టీలోనే ఉంటూ తమ ప్రభుత్వంపైనే నిత్యం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎంతో ధైర్యంగా విమర్శలు చేస్తుండటం మనం చూస్తున్నాం. అయితే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అధికార పార్టీలో ఉంటూ తమ పార్టీపైనే ఇటీవల తరచూ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈటెల టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల అంటే మార్చి 22న మంత్రి ఈటెల తన సొంత నియోజకవర్గంలో ఓ సభలో పాల్గొని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తాము గులాబీ ఓనర్లమని, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న వ్యాఖ్యలతో పాటు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్‌ పథకాలతో పేదరికం పోదని ఈటెల వ్యాఖ్యానించడం అధికార పార్టీలో దుమారం రేపింది. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారని… మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని టీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూనే ఈటెల మాట్లాడరని ప్రచారం జరిగింది కూడా. దీంతో మంత్రి కేటీఆర్ వెంటనే ఈటెలను వెంటబెట్టుకుని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే పరిస్థితి చక్కబడింది అనుకుంటుండగా మరోసారి ఈటెల తన తూటాల్లాంటి మాటలతో టీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని… అవ‌స‌రాన్ని బ‌ట్టి అది మండుతుంద‌ని ఈటెల వ్యాఖ్యానించారు. తాను మంత్రి క‌న్నా ముందు మ‌నిషిన‌ని అన్నారు. గ్రామీణ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని, ఒక ప్ర‌భుత్వం త‌ర్వాత మ‌రోక ప్ర‌భుత్వం చేస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్ర‌జ‌ల‌ను పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

ఈటెల వ్యాఖ్యలు అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటెల కూడా మరో రఘురామకృష్ణంరాజుగా అయ్యారని సోషల్ మీడియాలో చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. అస‌లు ఈటెల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.. ఈటెల‌, సీఎంకు మ‌ధ్య ఎక్క‌డ చెడింది అంటూ రాజకీయ పండితులు తమ విశ్లేషణలు మొదలుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement