పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని పెద్ద నగరాలకు కూడా బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను ఆదర్శంగా తీసుకుని బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారని.. ఈ క్రమంలో 10 వేల జనాభా ఉన్న బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని ఈటెల చెప్పారు.
ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సుతో పాటు అటెండర్ ఉంటారని… ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయని ఈటెల పేర్కొన్నారు. కావాల్సిన మందుల కోసం నెలకు రూ. 20 వేలు సమకూర్చామని చెప్పారు. అన్ని బస్తీ దవాఖానాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో అనుసంధానం చేశామన్నారు. బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ దవాఖానాలు హైదరాబాద్‌లో సక్సెస్ కావడంతో.. వీటిని మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.