ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతలు ప్రాధాన్యత ఎంతో ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన కృషి చేస్తున్నాదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించలేక పోయారని, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చొరవ తీసుకొని ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని విషయమని ఆయన అన్నారు. ఇక నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్స్ నిర్వహించాలని ఆయన కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడు ఒత్తిడితో ఉండే పోలీస్ అధికారులు, పోలీసుల కోసం పోలీస్ మీట్ నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ క్రీడలు పోలీసుల మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
పోలీస్ శాఖ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాదని ఆయన అన్నారు. అందులో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులు ఒకవైపు భర్తీ చేస్తూనే, మరొకవైపు అర్హులైన పోలీసు అధికారులకు, పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసులు విధి నిర్వహణకు అవసరమైన వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పోలీసుల విధి నిర్వహణకు సులభతరం చేసిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందే విధంగా చర్యలు గైకొంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను మంత్రి ప్రధానం చేశారు. అంతక్రితం కబడ్డీ, టగ్గఫర్, రన్నింగ్ ఫైనల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధ్యక్షత వహించారు.