నెల్లూరు జిల్లాలో కరోనా ఉధృతిపై రాష్ట్ర వైద్య మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కొవిడ్ నియంత్రణకు జగన్ అన్ని చర్యలు చేపట్టారని తెలిపారు. ఐదుగురు మంత్రులతో కొవిడ్ నివారణకు కమిటీ వేసినట్లు వెల్లడించారు. నెల్లూరులో ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్ ను ఆదేశించామన్నారు. నెల్లూరు జిల్లాలో 12 కొవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 3097యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయని తెలిపారు.
నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న 561మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. కరోనా బాధితులకు అవసరం అయిన మందులు,ఆహారం అందించాలని సూపరింటెండెంట్ ను అదేశించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నెల్లూరు తో పాటు గూడూరు, ఆత్మకూరు, కావలి ఏరియా హాస్పిటల్స్ లో కూడ కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒక్క నెల్లూరులోనే 8 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ పెషేంట్స్ కోసం బెడ్స్ సిద్ధం చేసినట్లు వివరించారు. కరోనా బాధితులకు నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండడానికి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ ను కూడ నియమించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ 800 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. మిగిలిన వారందరు హోమ్ ఐసోలేషన్ వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయల్లో, వ్యాపార సముదాయలు వద్ద నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని చోట్ల ధర్మల్ గన్స్, శానిటేజర్స్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. అన్ని ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఎక్కువ ఫీజులు వసూలపై వస్తున్న పిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహారిస్తుందని స్పష్టం చేశారు. మాస్క్ లేకుండా బైట తిరిగితే రూ. 100 ఫైన్ కూడ అమలులో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 3,500 వరకు RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కు నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు నెల్లూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కోవిడ్ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించడానికి రేపు మంగళగిరిలో ప్రభుత్వం నియమించిన 5గురు మంత్రులు కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు పర్యవేక్షణ చేస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.