Friday, November 22, 2024

ఎంఐఎం అంటే కేసీఆర్‌కు భయం, పాతబస్తీని రోహింగ్యాల అడ్డాగా మార్చారు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంఐఎం పార్టీ అన్నా, ఓవైసీ బ్రదర్స్‌ అన్నా సీఎం కేసీఆర్‌కు భయమని, పాతబస్తీని పూర్తిగా రోహింగ్యాలకు అడ్డాగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సంజయ్‌ మాట్లాడుతూ, పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకున్నారని, ఓవైసీలకు భయపడే మెట్రోను పాతబస్తీకి విస్తరించడం లేదని దుయ్యబట్టారు. పాతబస్తీని రోహింగ్యాలకు అడ్డాగా మార్చిన ప్రభుత్వం అక్కడి ప్రజల జీవితాలను ఛిద్రం చేశారని మండిపడ్డారు. తీవ్రవాదంతో ఏ పార్టీ కూడా రాజీపడొద్దని, ప్రత్యేక్షంగా, పరోక్షంగా తీవ్రవాదాన్ని సమర్థించే పార్టీలన్నీ తమ దృష్టిలో దేశద్రోహ పార్టీలేనని వ్యాఖ్యానించారు. తీవ్రవాదం పాతబస్తీలో ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

తీవ్రవాదం వల్ల కశ్మీర్‌ మాదిరిగానే ఎంఐఎం వల్ల పాతబస్తీ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసన్నారు. ప్రకృతిని ఆరాధించే పార్టీ బీజేపీ అని, ప్రధాని నరేంద్ర మోడీకి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని సంజయ్‌ ఆకాంక్షించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన వ్యక్తి మోడీ అని కొనియాడారు. నియంత కేసీఆర్‌ పాలనలో పాతబస్తీతో పాటు తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీల పెంపు సహా అనేక రకాల పన్నులతో మోయలేని భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం దిశగా శుభకృత్‌ నామ సంవత్సరంలో బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. పంచాంగ శ్రవణం చేసిన గర్రెపల్లి మహేశ్వరశర్మను బండి సంజయ్‌ సన్మానించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పంచాంగ శ్రవణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీలు విజయశాంతి, చాడా సురేష్‌రెడ్డి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, నేతలు స్వామిగౌడ్‌, గూడూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి, ఉపాధ్యక్షులు ప్రకాష్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement