Saturday, November 23, 2024

ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

ఏపీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై వాహనాలను ఆపి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తాజాగా ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొనిదెన గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులమంటూ ఇద్దరు దుండగులు గ్రానైట్ లారీని ఆపి.. డ్రైవర్ వద్ద నుంచి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు రాజుపాలెం వైపు నుంచి వస్తున్న గ్రానైట్ లారీని అడ్డుకున్నారు. తాము బల్లికురవ పోలీసులమని లారీకి చెందిన బిల్లులు చూపించాలని.. లేదంటే రూ. 2 లక్షలు చెల్లించాలని డ్రైవర్ ను బెదిరించారు. డ్రైవర్ పై కర్రలతో దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు వాహన డ్రైవర్ భయంతో వెంటనే యజమాని లలిత్ కు ఫోన్ చేశాడు. డబ్బులైనా చెల్లించాలి లేదా స్టేషన్‌కైనా రావాలని దుండగులు బెదిరిస్తున్నట్లు తెలిపాడు. కంగారు పడిన యజమాని లలిత్ అతని వద్ద అంత సొమ్ము లేకపోవడంతో.. ఒంగోలులోని బంధువుల వద్ద తీసుకుని దుండగులు అడిగిన మెుత్తాన్ని సిద్ధం చేసుకున్నాడు. డబ్బు సర్ధుబాటు చేయగానే తన డ్రైవర్‌కు తెలిపాడు. డ్రైవర్​ నిందితుల వాహనాన్ని తీసుకుని యజమాని వద్దకు వెళ్లి రూ. 2 లక్షలు తెచ్చి వారికి ఇచ్చాడు. ఈ దాడి ఘటనతో భయపడిన గ్రానైట్ ఓనర్ లలిత్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయినా ఈ విషయం పోలీసులకు తెలియడంతో దర్యాప్తు పారంభించారు. నిందితులిద్దరూ మాస్కులు ధరించి.. నెంబరు ప్లేట్ లేని పల్సర్ వాహనంపై వచ్చి దాడి చేసినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement