హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ, బీఈడీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామి అటకెక్కినట్లుగా తెలుస్తోంది. దాదాపు గత మూడేళ్ల నుంచి ఈ పథకం అమలు కోసం విద్యార్థులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామిని అమలు చేయాలని విద్యార్థి, అధ్యాపక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా మధ్యాహ్న భోజన పథకం అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్తో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో అమలు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం కార్యక్రమం అమలుకోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా పరీక్షల్లో మంచి ఫలితాలను రాబట్టొచ్చని అధ్యాపకులు చెప్తున్నారు.
కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పెడితే భోజనానికి ఇంటికి వెళ్లకుండా అక్కడే చదువుకొవడంతోపాటు విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించవచ్చనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలనుకుంది. ఇందులో భాగంగానే 2018-19 విద్యాసంవత్సరం నుంచే ఇంటర్, డిగ్రీ, బీఈడీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో దీన్ని ప్రారంభించాలనుకుంది. తద్వారా ఈ విద్యా సంస్థల్లో చదువుకునే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం ఇప్పటికే అమలవుతోంది. అలాగే జూనియర్, డిగ్రీ, ఇతర కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేసి విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరచాలని సదుద్ధేశ్యంతో దీనిని ముందుకు తీసుకొచ్చినా నేటికీ అది మాత్రం కార్యరూపం దాల్చడంలేదు.
విద్యను అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులు ఉదయమే బస్సుల్లో ప్రయాణించి తరగతులకు హజరవుతుంటారు. ఈ క్రమంలో ఉదయం పూట వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నది తినిరావడం లేదంటే పస్తులతోనే క్లాసులకు హాజరై మధ్యాహ్నం తరువాత ఇంటికెళ్లడం చేస్తుంటారు. కొంత మంది విద్యార్థులు మాత్రం మధ్యాహ్ననికి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటారు. కానీ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికెళ్లే విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరుకాకపోవడంతో పరీక్షల్లో ఫెయిల్ కావడం, డ్రాపౌట్ అవడం జరుగుతోంది. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలకూ గురవుతున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా విద్యార్థినిలపై పడుతోంది. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం తగ్గుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీనికోసం మంత్రుల బృందం ఓ స్వచ్ఛంద సంస్థతో సంప్రదించి పథకాన్ని అమలుపర్చాలని కూడా భావించారు. దీని వల్ల కళాశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడం, విద్యార్థులకు పౌష్ఠికాహారం అందుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ పథకం అటకెక్కినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 405 ఉండగా డిగ్రీ కాలేజీలు 125 ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో దాదాపు 2 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ కాలేజీల్లోనూ దాదాపుగా 1.20 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివేవారు మరో లక్ష వరకు ఉంటారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సౌజన్యంతో ఈ పథకాన్ని కళాశాలల్లో అమలు చేయాలని అప్పట్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. కానీ అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. కనీసం వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా దీన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..