మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఉద్యోగుల వేతనం పెంచడంలేదని ప్రకటించింది. దీనిపై ఉద్యోగులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యయ నియంత్రణ పేరుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. తాజాగా వేతనాలు కూడా పెంచడంలేదని చేసిన ప్రకటన ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీసింది. కంపెనీ వేతనాలు పెంచకున్నా ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా ఉద్యోగులకు సూచించారు. దీనిపై ఆయన ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.
కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఉద్యోగులకు వివరిస్తూ, ఆదాయం పెంచుకునే మార్గాన్ని కూడా సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే ఆటోమెటిక్‌గా ఉద్యోగులకు అందే పరిహారం కూడా పెరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఉద్యోగి మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర పెరిగేలా పని చేయాలని కోరారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలు సాధిస్తే, స్టాక్ ధర ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ షేరు ధర 33 శాతం పెరిగిందని ఆయన తన లేఖలో తెలిపారు.
ఆర్ధికంగా ఉన్న ఇబ్బందుల మూలంగా ఈ సంవత్సరం కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెంచలేమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు తెలిపారు. వేతనాలు పెంచకున్నా, బోనస్‌లు, స్టాక్ అవార్డులు కొనసాగుతాయని తెలిపారు. ఆదాయాలు తగ్గిపోయాయని మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం జనవరిలో 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
వేతనాలు పెంచలేమని చెప్పిన మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిసియన్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. మరో వైపు 68.7 బిలియన్ డాలర్లతో యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసింది.