వాంఖడే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై… ముంబై ముందు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, ఛేజింగ్‌లో రోహిత్ శర్మ (105 : 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో) సెంచరీ సాధించాడు. అయితే, మిగిలిన వారెవ్వరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబైపై చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీశ పతిరణ నాలుగు వికెట్లతో చెలరేగాడు.. ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబే (66) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో వచ్చిన ధోనీ (20: 4 బంతుల్లో 3 సిక్సర్లు) బౌండరీలతో హోరెత్తించాడు.