Saturday, November 23, 2024

TS | 5 స్టేషన్లతో పాతబస్తీకి మెట్రో రైలు.. మార్చి 8న పనులకు శ్రీకారం !

పాతబస్తీ వాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు పనులకు తొలి అడుగు పడనుంది. పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న ఈ మెట్రో మార్గంలో మొత్తం 5 స్టేషన్లు రానున్నాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ.2000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.

పాతబస్తీ మార్గంలో 5 మెట్రో స్టేషన్లు:

ఎంజీబీఎస్ నుంచి షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్‌ చౌక్, అలీజాకోట్ల, మీర్‌ మోమిన్‌ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మేర మెట్రో మార్గం ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 5 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి.

1) సాలార్‌జంగ్‌ మ్యూజియం
2) చార్మినార్
3) శాలిబండ
4) షంషీర్‌ గంజ్
5) ఫలక్‌నుమా

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 రూట్ మ్యాప్:

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రాయదుర్గం – విమానాశ్రయం మెట్రో మార్గం నిర్మాణ పనులను పెండింగ్‌లో పెట్టాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో పలు దఫాలుగా చర్చల అనంతరం హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెట్రో విస్తరణ ప‌నుల్లో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో 4 కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.

ప్రతిపాదిత మెట్రో మార్గాలు:

కారిడార్‌ 2: ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు (5.5 కి.మీ.)
కారిడార్‌ 2: ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు (1.5 కి.మీ.)
కారిడార్‌ 4: నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు (నాగోల్‌ – ఎల్బీ నగర్‌ – చాంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి నుంచి విమానాశ్రయం వరకు) – (29 కి.మీ.)
కారిడార్‌ 4: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు (రాజేంద్రనగర్) వరకు (4 కి.మీ.)
కారిడార్‌ 5: రాయదుర్గం నుంచి అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు (రాయదుర్గం – నానక్‌రామ్‌గూడ – విప్రో జంక్షన్‌ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు) (8 కి.మీ.)
కారిడార్ 6: మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కి.మీ.)
కారిడార్‌ 7: ఎల్బీ నగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌ నగర్‌ వరకు (8 కి.మీ.)

Advertisement

తాజా వార్తలు

Advertisement