హైదరాబాద్, ప్రభన్యూస్: వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రసిద్దిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్‌కు వస్తుంటారు. వారిని లక్ష్యంగా చేసుకుని వినాయక నవరాత్రుల సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు యోచిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఈనెల 18 నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో భక్తులకు టిక్కెట్ కొనుగోలు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఘటనలు, దొంగతనాలు జరగకుండా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.