Saturday, November 9, 2024

TG | శంషాబాద్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో : సీఎం రేవంత్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: హైదరాబాద్‌ మహానగరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మేరకు అయన శనివారం రాత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి రోడ్‌ కనెక్టివిటీ రూట్‌ మ్యాప్‌పై అధికారులు సీఎంకు వివరించారు. రూట్‌ మ్యాప్‌పై పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఫ్యూచర్‌ సిటీలో రేడియల్‌ రోడ్స్‌ అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. బుద్వేల్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన సముదాయం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్‌ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కోరారు.

రోడ్‌, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని చెప్పిన సీఎం రేవంత్‌ యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెట్టుబడులు మాత్రమేకాకుండా రవాణా సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తేనే బహుళ జాతి సంస్థలు ముందుకొస్తాయని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రస్తుతమున్న మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement