- మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లపై సీఎం సమీక్ష
ఫ్యూచర్ సిటీ, సమీర్‌పేట, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సవివరమైన ప్రణాళికలను (డిపిఆర్) మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది… ఏప్రిల్ నెలాఖరులోగా టెండర్లు ఆహ్వానించాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్ – శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యారడైజ్ – మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
సమీర్‌పేట, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అక్కడ అధునాతన సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలతో భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అదేశించారు.
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని… అలైన్‌మెంట్ రూపకల్పన చేసేటప్పుడు సమగ్ర క్షేత్రస్థాయి విశ్లేషణ చేయాలని అన్నారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ తదితరులు పాల్గొన్నారు.