Sunday, November 24, 2024

Delhi | అవినాశ్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో నేడు మెన్షనింగ్.. సునీత పిటిషన్ ప్రస్తావనకు అనుమతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ముంజూరైన ముందస్తు బెయిల్ రద్దు అంశంపై వివేక కుమార్తె డా. సునీత నర్రెడ్డి శుక్రవారం (నేడు) సుప్రీంకోర్టులో ప్రస్తావించనున్నారు. విచారణ తేదీని నిర్ణయించి వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు ఆమెకు అనుమతి లభించింది. శుక్రవారం ఆమె తరపున న్యాయవాది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు. మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ డా.సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అవినాశ్ రెడ్డిపై తీవ్రమైన అభియోగాలున్నాయని, కేసులో మెరిట్స్‌ను పట్టించుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులోని లోపాలను ప్రస్తావిస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఇంకా విచారణకు స్వీకరించలేదు. ప్రత్యేకంగా ప్రస్తావించకపోతే అది ఎప్పటికోగానీ కేసుల జాబితాలో చేరే అవకాశం లేదు. అందుకే శుక్రవారం కేసును ప్రస్తావించి త్వరగా విచారణ చేపట్టమని కోరడానికి డా. సునీత తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. మరోవైపు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా డా. సునీత పిటిషన్‌కు అనుకూలంగా తమ వాదనలు వినిపించేందుకు సమాయత్తమవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement