మైఖేల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో సందీప్ కిషన్.. మరి ఈ చిత్రం సందీప్ కి విజయాన్ని అందించిందో లేదో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.
కథ ఏంటంటే.. చిన్నతనంలోనే అనాథగా మారిన మైకేల్ (సందీప్ కిషన్).. తన తల్లిని మోసం చేసిన తండ్రిని చంపడమే లక్ష్యంగా ముంబయిలో అడుగు పెడతాడు. అప్పటికే అక్కడ పెద్ద డాన్ గా ఎదిగిన గురునాథ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) అతణ్ని చేరదీస్తాడు. పెరిగి పెద్దవాడయ్యాక గురునాథ్ ప్రాణాపాయంలో ఉండగా ఓసారి.. ఒక కేసు విషయంలో మరోసారి రక్షిస్తాడు మైకేల్. దీంతో అతడిపై గురుకి గురి కుదురుతుంది. తన మీద ఎటాక్ చేసిన వ్యక్తుల్లో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లిన గురు.. చివరి వ్యక్తితో అతడి కూతురిని కూడా చంపే బాధ్యతను మైకేల్ కు అప్పగిస్తాడు. ఆ మిషన్ మీద ఢిల్లీకి వెళ్లిన మైకేల్.. తాను చంపాల్సిన వ్యక్తి కూతురు తీర (దివ్యాంశ)తోనే ప్రేమలో పడతాడు. మరి గురు చెప్పినట్లు అతను తీర తండ్రిని చంపాడా.. లేక తీర కోసం అతణ్ని వదిలేశాడా.. అతను తీసుకున్న నిర్ణయంతో ఎదురైన పరిణామాలేంటి.. ఇంతకీ మైకేల్ తండ్రి ఎవరు.. అతణ్ని మైకేల్ చంపాడా లేదా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాల్సిందే.
విశ్లేషణ.. హీరో వీరుడు శూరుడు అంటూ చెప్పడం.. హీరో ఎంట్రీ ఇచ్చి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ చితకబాదడం. అతను మామూలోడు కాదు అగ్నిపర్వతం అంటాడు ఒకడు. అతడి దెబ్బ రుచిచూశావా అంటాడు ఇంకొకడు. అతడి రక్తంలో వేడి చూశావా అంటాడు మరొకడు. ఇలా సీన్లోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తీ హీరోకు ఎలివేషన్ ఇవ్వడమే సరిపోతుంది. 90ల నేపథ్యం.. మాఫియా కథ.. విజువల్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. హీరో పాత్ర చిత్రణ.. అతడి ఎదుగుదల.. ఇలా ప్రతి విషయంలోనూ ‘కేజీఎఫ్’ను అనుకరిస్తూ సాగిన సినిమా. 90ల నాటి కథగా చూపించి హీరో హీరోయిన్లకు ఇప్పటి తరహాలో స్టైలిగ్ చేయించడం దగ్గరే ‘మైకేల్’ మిస్ ఫైర్ అనే విషయం అర్థమైపోతుంది. దర్శకుడు సినిమాలో ప్రతిదీ ‘స్టైల్’గా ఉండాలని చూసుకున్నాడే తప్ప కథాకథనాలు పకడ్బందీగా తీర్చిదిద్దుకోవడం గురించి ఆలోచించలేదు. అనాథగా పెరిగిన కుర్రాడు.. ఒక మాఫియా డాన్ దగ్గర అండర్ డాగ్ గా మొదలుపెట్టి ఆ డాన్ ను ఢీకొట్టే స్థాయికి ఎదిగిపోవడం.. ఈ లైన్ మీద పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. విపరీతమైన బిల్డప్ తో మొదలై కాసేపటికే తుస్సుమనిపించే ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకులు ఈ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతారు. ముందుకు సాగేకొద్దీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది ‘మైకేల్’. ప్రోమోల్లో విజయ్ సేతుపతి కూడా కనిపించడంతో అతనెప్పుడు వస్తాడా అని కొంతసేపు ఎదురు చూస్తాం కానీ.. తెర మీద జరిగే తంతు చూశాక ఇక అతను వచ్చినా మార్పేమీ ఉండదన్న నిస్పృహ వచ్చేస్తుంది. పూర్తిగా గ్రాఫ్ పడిపోయాక సేతుపతి రంగప్రవేశం చేసినా ఫలితం లేకుండా పోయింది.
నటీనటులు..సందీప్ కిషన్ మైకేల్ పాత్రలో చూడ్డానికి బాగున్నాడు. అతను తన లుక్ మీద బాగానే దృష్టిపెట్టాడు. చేసింది రౌడీ పాత్రే కానీ.. అందులో స్టైలిష్ గా కనిపించాడు. పెర్ఫామెన్స్ కూడా ఓకే. నటన పరంగా అతడికి పరీక్ష పెట్టే.. ప్రత్యేకంగా అనిపించే పాత్రయితే కాదు . హీరోయిన్ దివ్యాంశ అందంగా కనిపించింది. ఆ పాత్రలో విషయం లేదు. విజయ్ సేతుపతి కనిపించిన కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. కీలక పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ జస్ట్ ఓకే అనిపించాడంతే. ఆ పాత్రలో కూడా బిల్డప్ తప్ప విషయం లేకపోయింది. గౌతమ్ ను వాడుకుంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్ని బాగా చేయగలడనిపిస్తుంది కానీ.. ఇందులో మాత్రం దర్శకుడు అతణ్ని సరిగా వాడుకోలేదు. వరలక్ష్మి చిన్న పాత్రలో కాసేపు మెరిసింది. అనసూయ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. తన పాత్రకు ఇచ్చిన డైలాగులు ఓవర్ గా అనిపిస్తాయి. అయ్యప్ప పి.శర్మ బాగా చేశాడు.
సాంకేతికత.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మంచి పేరున్న శ్యామ్ సి.ఎస్.. ‘మైకేల్’లో విషయం లేని సన్నివేశాలను పైకి లేపడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ ఆర్ఆర్ తో అతనిచ్చే బిల్డప్ కి.. సన్నివేశాల్లో ఉన్న కంటెంట్ కి అసలు సంబంధం లేదు. అతడి పాటలు పర్వాలేదు. కెమెరామన్ కిరణ్ కౌశిక్ సైతం రిచ్ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. 90ల నేపథ్యాన్ని తెర మీద బాగానే చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నా.. పేరున్న ఆర్టిస్టులున్నా.. సినిమా భరించలేని విధంగా తయారైందంటే ‘మైకేల్’ బోల్తా కొట్టేసిందంటే అది రైటర్ కమ్ డైరెక్టర్ రంజిత్ జయకొడి లోపమే. అతడి టేకింగ్ మాత్రం స్టైలిష్ గా ఉంది తప్ప.. మిగతా ఎందులోనూ మెప్పించలేకపోయాడు. సాధారణమైన కథాకథనాలు.. విపరీతమైన బిల్డప్ తప్ప విషయం లేని నరేషన్ తో అతను ‘మైకేల్’ నీరుగారిపోయేలా చేశాడు. మొత్తానికి సినిమా చూడాలా వద్దా అనేది ఆడియన్స్ పై ఆధారపడి ఉంటుంది.