Saturday, November 23, 2024

చోక్సీని భారత్ పంపండి: అంటిగ్వా ప్రధాని

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడు  మెహుల్‌ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యూబాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనపై లుకౌట్ నోటీస్ జారీచేయడంతో డొమినికా పోలీసులు పట్టుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు.  ఆంటిగ్వా అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మేరకు సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్, అంటిగ్వాకు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని అంటిగ్వా ప్రధాని తెలిపారు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించారని, ఆయనను భారత్ కు పంపాలని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ కోరారు.

భారతదేశం డొమినికాతో మంచి సంబంధాలను కలిగి ఉందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఇటీవల “వ్యాక్సిన్ మైత్రి” చొరవలో భాగంగా కరేబియన్ ద్వీపానికి లక్ష కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా పంపించిందని పేర్కొంది. ఈ నెల 24న రాత్రి డిన్నర్‌కు వెళ్లిన చోక్సీ.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అంటిగ్వా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించారు.

పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీని దేశానికి తీసుకువచ్చేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నాలు చేస్తున్నాయి. చోక్సీ 2017లో అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్‌ మోదీకి మెహుల్‌ చోక్సీ మేనమామ అవుతారు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్నారు. మెహుల్ చోక్సీ కోసం సీబీఐ, ఈడీలు గాలిస్తున్నాయి. మొత్తం రూ.13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే 2018 జనవరి 4 అంటిగ్వాకు వెళ్లారు. చోక్సీ కేవలం భారతీయ బ్యాంకులనే కాదు, దుబాయ్, అమెరికాలకు చెందిన వ్యాపారులు, కస్టమర్లను మోసం చేసినట్టు ఈడీ ఛార్జ్‌ షీట్‌లో తెలిపింది.  అయితే, తనపై ఉన్న కేసులు రాజకీయ కుట్రల ఫలితమేనని, భారతదేశంలో అతని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చట్టవిరుద్ధంగా అటాచ్ చేసిందని మెహుల్ చోక్సీ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement